మా తూ .గో. జిల్లాలో ఆధార్ ప్రహసనం నడుస్తోంది . ఈ నెలాఖరుతో టైము అయిపోతుందట .మీమీ వార్డులలో నమోదు చేసుకోమని మైకులో టముకేసారు. ఈ కార్డు లేకపోతే దేశం నుంచే గెంటేస్తారేమో అన్నట్టు టీవీల్లో, పేపర్లలో ఊదరగొట్టేసారు కదా ; సరేనని ఆదరా బాదరాగా కుటుంబ సమేతంగా బయల్దేరాము
.మేము వెళ్లేసరికి ఒకాయన అక్కడ అధికారితో వాదిస్తున్నాడు.
బాబూ ! వీటితో బాటు" ఆధారం" ఏదయినా పెట్టాలయ్యా ,
---దానికోసమే కదండయ్యా వొచ్చింది. మళ్ళీ" ఆదార"మేటండి ?
అదికాదయ్యా నీ అడ్రస్సు రుజువుకి" ఆధారం" కావాలి. వోటరు కార్డుందా?
----ఎక్కడండీ , మూడు సార్లు పుటోలు తీసుకున్నారుగానీ కార్డు ఇవ్వలేదండయ్యా .
----పోనీ రేషను కార్డుందా?
ఏదండీ! రాజసేకర్రెడ్డిగారిత్తారంటే పెట్టేం .పాపమాయన పోయేడు. ఉంకో రెడ్డిగారొచ్చి మళ్ళీ పెట్టమంటే పెట్టేం . ఉప్పుడికి దిక్కులేదు. ఈ ఆదారమన్నా ఇత్తారా ?
----ఎలాగయ్యా బాబూ ఎదోకాధారం పట్రా. ఫో.
అతను నా వైపు చూసి మీరైనా చెప్పండయ్య నా దగ్గిర కాయితాలేం లేవు , అంటుంటే ఏం చెప్పాలో నాకర్ధం కాలేదు.
సరే ఒహాయన మా కాగితాలు చూసి కంప్యూటర్ దగ్గరకి పంపాడు. కంప్యూటర్ ముందు అంతా యువరక్తమే .మా పేర్లు కంప్యూటర్లో ఒకావిడ టైపు చేస్తోంది . అదృష్తం కొద్దీ వాళ్ళేమి టైపుచేస్తున్నారో స్క్రీను మీద కనబడుతోంది. మామూలుగా ఇంగ్లీష్ లో తప్పుల్లేకుండా టైపు చేస్తేనే అది తెలుగులోకి మారేసరికి మన పేర్లు శ్రీ లంక వాళ్ళ పేర్లలాగా మారిపోతాయి .ఆవిడ మా పేర్లు నిజంగానే మార్చేసింది. కుమార్ కాస్తా కూమర ,రాజ్ సునీల్ కాస్తా రాజ సునిల , గౌతం టవర్స్ కాస్తా గోతం టవర్స్ అయిపోయాయి. తల్లీ కొంచెం మార్చమని చెప్పేసరికి ఆవిడ కొంచెం చిరాగ్గా చూసి మార్చిందనుకోండీ తరవాత కళ్ళు ,వేళ్ళు,ఫోటో లు తీసేటప్పుడు మాత్రం ఆ చిరాకు నా వేళ్ళ మీద చూపించింది . కానీ లక్ష్మే ఫణి గారు తన బ్లాగులో చెప్పినట్టు అక్కడ అదొక్కటే బాగుంది. పాపం రోజుకి ఎంత మంది వేళ్ళునొక్కాలో కదా.
ఇంతలో పక్క టేబుల్ దగ్గర ఒకావిడ అతని మీద కేకలేస్తోంది. సెక్స్ అంటా వేంట్రా.అనరుస్తోంది. అతను బిక్కచచ్చి పోయి చూస్తున్నాడు. తీరాచూస్తే ఆవిడ కూతురి పేరు ఎదురుగ తనిఖీచేసిన ఆఫీసర్ సెక్స్ రాయలేదని , తరవాత పేరు సెక్స్ఏమిటని అడిగాడు.పాపమావిడ సెక్స్ అంటే వేరే అర్ధంలో ఉంది. ఏం చేస్తాం.ఆవిడకి సర్ది చెప్పి బయటపడ్డాం.
అబ్బ ,ఆరు నెల్ల టెన్షన్ . వాళ్ళిచ్చిన రసీదు చూసుకుంటే ఏదో వరల్డ్ కప్ సాధించినంత ఆనందం . ఈకార్డుతో మీ కార్డులు ఎన్నవుతాయి డాడీ? అనడిగాడు.మా అబ్బాయి. నిజమే, జేబు నిండా కార్దులే. బండి సి బుక్కు కార్డు, డ్ర యివింగు లైసెన్సు కార్డు, ఏటీఎం కార్డు, డ్యూటీకి వెళ్ళినప్పుడు గీకడానికి మా కంపెనీ వాళ్ళిచ్చిన ఐడీ కార్డు, ఆ మధ్యెప్పుడో దురదెక్కి తీసుకున్న క్రెడిట్టు కార్డు , పాన్ కార్డు, ఓటరు కార్డు, వీళ్లిస్తే ఆధార్ కార్డు.
అబ్బ ,ఆరు నెల్ల టెన్షన్ . వాళ్ళిచ్చిన రసీదు చూసుకుంటే ఏదో వరల్డ్ కప్ సాధించినంత ఆనందం . ఈకార్డుతో మీ కార్డులు ఎన్నవుతాయి డాడీ? అనడిగాడు.మా అబ్బాయి. నిజమే, జేబు నిండా కార్దులే. బండి సి బుక్కు కార్డు, డ్ర యివింగు లైసెన్సు కార్డు, ఏటీఎం కార్డు, డ్యూటీకి వెళ్ళినప్పుడు గీకడానికి మా కంపెనీ వాళ్ళిచ్చిన ఐడీ కార్డు, ఆ మధ్యెప్పుడో దురదెక్కి తీసుకున్న క్రెడిట్టు కార్డు , పాన్ కార్డు, ఓటరు కార్డు, వీళ్లిస్తే ఆధార్ కార్డు.
ఇంతకీ ఈ కార్డు వల్ల మనలాంటి వాళ్ళకేమైనా ప్రయోజనం ఉందా?
ఆధార్ కార్డు ఇచ్చినతరువాత గ్యాస్ మీద సబ్సిడీ తీసేస్తామంటున్నారు . మధ్య తరగతివాడికి మిగిలిందే మయినా ఉందీ అంటే అదొక్కటే. అది కూడా పీకేస్తారా? పన్నులు మాత్రం జీతం తీసుకోకముందే కట్ చేసేస్తారు. సబ్సిడీలన్నీ బలిసిన వాళ్ళకీ , పేదవాళ్ళకే! మధ్య తరగతి వాడికి మొలత్రాడు కూడా మిగలనివ్వరన్నమాట. ఏం చెయ్యగలం ? గొణుక్కోడం తప్ప ?.!!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి