నా గురించి

                  నా గురించి  చెప్పుకోడానికి "  పెద్దగా "  ఏమీ లేదు. పుట్టిందీ పెరిగిందీ చదువుకున్నదీ  ఉద్యోగం వెలగ బెట్టిందీ  అన్నీ గోదావరి ఒడ్డునే!  పెద్దగా చదువు ఒంటబట్టలేదుగానీ నాన్నగారి దగ్గరనుంచి రాజకీయాలు మాత్రం ఒంటబట్టాయి. ఆయన  కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా పని చేసారు.దాంతో ఇల్లంతా కమ్యూనిస్టు వాసనే. అదే మాకూ అంటుకుంది.అయితే  ఈ కుళ్ళు రాజకీయాలు భరించలేక ఆయన  మధ్యలోనే వాటిని వొదిలి పెట్టి  ఆరెంపీ వైద్యుడిగా తన వృత్తిని కొనసాగిస్తూ ప్రజలకు తనకు చేతనైన సేవ చేస్తూ కాలంచేసారు.
         మాది తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామం. పదవ తరగతి వరకూ చదువు అక్కడే. తరువాత మండపేట జూనియర్ కాలేజిలో ఇంటర్. ఎందుకో చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పుస్తకాలు విపరీతంగా చదివేవాడిని. కానీ క్లాసు పుస్తకాలు మాత్రం తలకేక్కేవి కాదు. అందుకే చదువు అక్కడితో ఆగింది. ఉద్యోగం విషయానికి వస్తే రాజమండ్రిలో ఒక ప్రయివేట్ కంపెనీలో ఇరవై ఏడు సంవత్సరాలు సర్వీసు చేసి ఇక చాల్లే అని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. 
         కంప్యూటర్ అంటే విపరీతమైన ఆసక్తి ఉండడంతో  కంప్యూటర్ కొని, కంప్యూటర్లకి సంబంధించిన పుస్తకాలు (తెలుగులో నల్లమోతు శ్రీధర్ గారి కంప్యూటర్ ఎరా, ఇంగ్లీష్ లో డిజిట్, పీసీ వరల్డ్ లాంటివి)  చదివి మంచి పట్టునే సాధించాను. ఎక్కడా ఎవ్వరిదగ్గరికీ వెళ్లి నేర్చుకున్నది లేదు. అన్నీ నా కంప్యూటర్ మీద ప్రయోగాలే. నల్లమోతు శ్రీధర్ గారే నా గురువు. ఈ బ్లాగు కూడా అలాగే తడబడుతూ మొదలెట్టిందే! సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం మీదా నా అభిప్రాయాన్నీ ఆవేదననీ వ్యక్తం చేసుకోవడానికి నాకు అత్యంత ఆత్మీయ నేస్తం నా బ్లాగు.
         ఇక దొరికిన ప్రతి పుస్తకం చదవడం నా అలవాటు. మనసుకు హత్తుకునేవీ మానవత్వాన్ని ప్రతిబింబించేవి, అప్పుడప్పుడు తగులుతుంటాయి. సినిమాలు చూసే అలవాటు లేదు. ఎప్పుడైనా మంచి సినిమా అనంటే ఏ టీవీలోనో కంప్యూటర్లోనో చూడ్డంతప్ప.  ఇక చదరంగం నా ప్రాణం. ప్రతిరోజూ ఇంటర్నెట్ లో చదరంగం ఆడవలసిందే. ఇష్టమైన పుస్తకాలంటే,  చందమామ, పంచతంత్ర కధలు, కాశీ మజిలీ కధలు,  టామ్ సాయర్, హకల్ బెరీఫీన్,  మాక్సిం గోర్కీ "  అమ్మ",   జాక్ లండన్   "  ఉక్కుపాదం".    శ్రీశ్రీ  మహాప్రస్థానం, యండమూరి  ఆనందో బ్రహ్మ ఇంకా మానవత్వాన్ని ప్రతిబింబించే, భావుకత్వాన్ని స్పర్శించే అనేక పుస్తకాలు, కధలు. 
          ఇక కుటుంబం విషయానికొస్తే భార్య, ఇద్దరు సుపుత్రులు. సుపుత్రులే. సందేహం లేదు. పెద్దవాడు  సాఫ్ట్ వేర్ ఇంజనీర్.   చిన్నవాడు ఇంకా విద్యార్ధే.       ఇదండీ నా కధ ! నా బ్లాగులో వ్రాసే విషయాలు మీకు నచ్చొచ్చు,నచ్చక పోవొచ్చు.నా అభిప్రాయాలు కొన్ని విషయాల్లో తప్పు కూడా కావొచ్చు. అటువంటి సమయంలో నిర్ద్వందంగా ఖండించి నా అభిప్రాయాన్ని సరిదిద్దుకునే అవకాశాన్నివ్వమని కోరుకుంటూ ........    కాండ్రేగుల  ఫణికుమార్ .  
                                                                                                                                                                                            

6 వ్యాఖ్యలు:

 1. Alamuru vaariki BJP no chance. kandragula is a trade mark for communism

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నమస్కారం! మీరు బహుశా ఆలమూరు వారే అనుకుంటున్నాను. మీరన్నది ఒకప్పుడు నిజమేగానీ మారుతున్న కాలమాన పరిస్తితుల్ని బట్టి మనం కూడా మారవలసి వస్తోంది. మీ స్పందనకి కృతజ్ఞుణ్ణి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నాకు మీ ఆలమూరుతో చాలా సంబంధం ఉంది.మా నాన్నగారు మండపేట లో హెడ్మాస్టారుగా పనిచేశారు,1955-58. నేను అక్కడ 4 ఫారం చదివాను. మా అన్నయ్యగారి అత్తవారి ఊరు మీ దగ్గరలోని జొన్నాడ. ఇంకో విషయం మా అన్నయ్యగారు,ఆలమూరులో జూనియర్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. "ఆలమూరు" అనగానే నాకు ఈవిషయాలన్నీ గుర్తుకొచ్చాయి. బైదవే మాది అమలాపురం.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాలా సంతోషంగా వుందండీ.మీరు లక్ష్మిఫణిగారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది.మీ బాతాఖాణీ కబుర్లు నేను అప్పుడప్పుడు చదువుతుంటాను.మంచికాలక్షేపం ప్లస్ లోకజ్ఞానం.
  మీ నాన్నగారు హెడ్మాస్టర్ గా చేసేటప్పటికి నేనింకా పుట్టలేదు.కొత్తూరు హైస్కూల్ లో నేను చదివేటప్పటికి ఇంకా జిల్లా పరిషత్ హైస్కూలే. అప్పటికింకా కాలేజి కాలేదు.అది కాలేజీ అయ్యేసరికి నేను రాజమండ్రిలో ఉద్యోగంలో జాయినై పోయాను.మా తమ్ముళ్ళకి మీ అన్నయ్య గారు తెలిసే అవకాశం వుంది. యేమైనా మీతో పరిచయం చాలా సంతోషంగా వుంది. మీరు క్రమం తప్పకుండా చాలా బాగా బ్లాగు వ్రాస్తున్నారు.మీ ఓపికకి అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పైన బొమ్మ బాగుందండి.

  నిజంగా, వెన్నెల్లో గోదావరి ఫొటొ తీసి పెడితే ఇంకా బాగుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చాలా థాంక్సండీ! నిజమే మీరన్నట్టు వెన్నెల్లో గోదారి అందమే వేరు. నేను ఎన్నో రాత్రులు వెన్నెల్లో గోదారిని చూస్తూ గడిపాను.రాత్రుళ్ళు ఆ గోదారి వేసవిలో చూస్తే ఒకలాగా,శీతాకాలంలో ఇంకోలాగా అద్భుతంగా కనిపిస్తుంది. తప్పకుండా నిజమైన ఫోటో పెట్టడానికి ప్రయత్నిస్తాను.

   తొలగించు