డిసెంబరు 4 వ తేదీ తెలుగువారు గర్వంగా చెప్పుకునే గాన గంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి జయంతి. ఇది ఆయన 89 వ జయంతి. గోదావరి తీరాన రాజమహేంద్రి నగరంలోని వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఘంటసాల అభిమానుల మధ్యన ఆయన జయంతి వేడుకలు ఆహ్లాదకరంగా జరిగాయి. విచిత్రమేమిటంటే ఆనం కళా కేంద్రం ఆరుబయట సుబ్రహ్మణ్య మైదానంలో భారీ హంగామాతో సినీ సంగీత దర్శకుడు "చక్రి" మ్యూజికల్ నైటు జరుగుతోంది. అదో ప్రాయోజిత కార్యక్రమం. అయినా కళాకేంద్రం లోపల ఘంటసాల అభిమానులకి లోటు లేదని రుజువుచేస్తూ, కుటుంబసభ్యులతో సహా హాజరై మధుర గాయకుడు ఘంటసాల పట్ల తమ అభిమానం తరగనిదని అభిమానులు నిరూపించారు.
ఇంతకీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఏ కార్పోరేట్ సంస్థో కాదు. ఒక సామాన్య ఘంటసాల అభిమాని. ఇంతటి భారీ కార్యక్రమాన్ని తన స్వంత ఖర్చులతో నిర్వహించి ఘంటసాల పట్ల అపార అభిమానాన్ని చాటుకుంటున్న ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామ వాసి డాక్టర్ ఆరేపల్లి నరసింహమూర్తి. వృత్తి రీత్యా గ్రామీణ వైద్యుడు. ప్రవృత్తి రీత్యా ఘంటసాల ఆరాధకుడు,గాయకుడు, సంఘ సేవకుడు. కేవలం ఘంటసాల పాటలనే పాడే ఈయన అనంతపల్లి గ్రామంలో అద్బుతమైన ఘంటసాల విగ్రహాన్ని స్థాపించి ప్రతి గురువారం ఆయన విగ్రహం ఎదుట పేదలకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ, పేద కళాకారులకు ఆర్ధిక సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. సహజంగా షిర్డీ సాయి భక్తుడైన ఈయన సాయి ఘంటసాల గానసభ మరియు సేవాసంఘం పేరుతో ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.ఈ సేవలో ఆయనకు బంధు మిత్రులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందిస్తున్నసహకారం అపూర్వం!
ఇప్పటికి సుమారు వెయ్యి పైనే ఘంటసాల సంగీత విభావరులు నిర్వహించిన ఈయనకు శాస్త్రీయ సంగీతం తెలియదు. కానీ తన గానంతో అశేష ఘంటసాల అభిమానుల్ని ఆనందంలో ముంచి తేలుస్తారు. ఆయన పాటలు వింటుంటే ఘంటసాల గారు వెళిపోతూ తన గొంతు ఈయనకిచ్చి వెళ్ళిపోయారా అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి ఘంటసాల లాగే పాడే అనేకమంది గాయకులు వొచ్చి, ఆయనకు నివాళులర్పించి, మూర్తిగారిని అభినందించడం విశేషం. ఘంటసాల అభిమానులు ఏ సమయంలో ఫోన్ చేసి పలకరించినా ఆప్యాయంగా పలకడం ఈయన సంస్కారం. కళలకుపెట్టింది పేరైన రాజమహేంద్రిలో, పక్కనున్న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి ఆయన ఈ మహత్తర కార్యక్రమాన్ని చెయ్యడానికి ముఖ్య కారకుడు ఆయన సోదరుడూ,పేపర్ మిల్లులో అసిస్టెంటు మేనేజరు, రాజమహేంద్రి నివాసి, శ్రీ ఆరేపల్లి వెంకటేశ్వరరావు.ఆయనకు రాజమహేంద్రి తరపున అభినందనలు.
ఏమైనా ఈ ఆదివారం మా రాజమహేంద్రి నగరం మూర్తి గారి చలవ వల్ల ఘంటసాల పుట్టినరోజున ఆయనని తల్చుకుని, ఆయన పాడిన మధురమైన పాటలని మూర్తిగారి గొంతులో విని, మైమరిచి చల్లగా సేదదీరింది!!
ఫోటోలు చూడండి.
మాస్టారిని గురించి, వారి గాత్రం గురించి స్పందిచే ప్రతి హృదయం ఎంతో ఆనందానుభూతికి లోనవుతుంది. ఇది ఘంటసాల కుటుంబం. అందరం ఆయన బంధువులమే. రాజమండ్రిలో ఈ కార్యక్రమం అనగానే "మహాభారతం పుట్టింది రాణ్మహేంద్ర వరంలో" అన్న మాస్టారి పాట గుర్తుకు వచ్చింది. ఈ వేడుకలను తమ ఆత్మబంధువు జన్మదినంగా జరుపుకున్న మీ సహృదయతకు నమస్సుమాంజలులు.
రిప్లయితొలగించండిసూర్యనారాయణ గారికి కృతజ్ఞతలు.ఘంటసాల మాస్టారి రుణం ఎవరూ తీర్చుకోలేనిది. ఆయన పాటలు మనం వింటున్నంత కాలం మన రుణం పెరిగిపోతూనే వుంటుంది. అందుకే కనీసం ఇటువంటి మంచి కార్యక్రమాలకి మనకి చేతనైన సహకారం అందించడం ఆనందంగా వుంటుంది.
రిప్లయితొలగించండిu r d inspiring person....
రిప్లయితొలగించండిthank u sir.
తొలగించండిచక్కగా వ్రాసి కళ్ళకు కట్టినట్టు చూపించారు!
రిప్లయితొలగించండిథాంక్యూ రసజ్ఞ గారూ! ఈ పండగలో ఖాళీచేసుకుని మా ఇంటికొచ్చి ఘంటసాల గారిని పలకరించారన్నమాట.నమస్తే ఆంధ్ర డాట్ కాం వారు వారి ఈ పేపర్ లో ఈ ఆర్టికల్ ని పునర్ముద్రించారు.
రిప్లయితొలగించండి