22, నవంబర్ 2011, మంగళవారం

జగన్ నోట వైరాగ్యపు మాట.



      "నేను కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే నాకీ తిప్పలు తప్పేవి. మంత్రి పదవి కూడ వచ్చి వుండేది. కాంగ్రెస్ లోంచి  బయటికొచ్చినందుకే నాపై సిబిఐ ఎంక్వయిరీ వేసారు."   ఇవీ నిన్న  ఓదార్పు యాత్రలో జగన్ మాటలు. ఈ మాటలు  జగన్ మనసులోని ఆందోళనని, అంతర్మధనాన్నీ తెలియజేస్తున్నాయి.  జగన్లో అప్పుడే వైరాగ్యం మొదలయిందన్నమాట. కాంగ్రెస్ పార్టీలోంచి వొచ్చిన ఎమ్మెల్యేలు నలుగురు జారిపోయేటప్పటికే వైరాగ్యం మొదలైతే,  ముసళ్ళ పండగ ఇంకా ముందే ఉంది కదా?. కాంగ్రెస్ అమ్మతల్లి ఇంకా తన విశ్వరూపం చూపించనే లేదు. అప్పుడే వైరాగ్యమైతే  ఎలా?  "థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ" తలపండి, గెడ్డం నెరిసిపోయిన చంద్రబాబునాయుడంతటి వాడే సిబిఐ ఎంక్వయిరీ అనగానే ఎక్కేగడప, దిగే గడప, కింద తిరుగుతున్నాడు.  నువ్వెంత? 
   కాంగ్రెస్ పార్టీలోంచి బయటికొచ్చేటప్పుడే ఇవన్నీ ఆలోచించుకొని వుండాల్సింది.  ఇప్పుడు ఈ దశలో ఇటువంటి మాటలు,  మాటతప్పని,  మడమ తిప్పనని చెప్పుకుంటున్న జగన్కు  అంతగా  నప్పవు.  రాజకీయాల్లో అనుభవ రాహిత్యం ఇటువంటి మాటలు  మాట్లాడిస్తుంది. ఇతడి  మాటలకి  ఇతడిని నమ్ముకుని  వెనక తిరుగుతున్నవాళ్ళ వెన్నులో చలి మొదలవుతుంది. ప్రజల్లో ఎంతో కొంత అభిమానాన్ని సంపాదించుకుని,రాజకీయ పార్టీగా నిలదొక్కు కుంటున్న తరుణంలో ఇటువంటి మాటలు కేడర్లో పిరికి తనాన్ని, నిస్సత్తువని  కలిగిస్తాయి. ఇప్పటికే చిరంజీవిని నమ్ముకుని గోతిలోకి దిగి, పీకల్లోతు మునిగి పోయిన ఎంతోమంది రాజకీయాలకి దూరమైపోయారు.ఈయన కూడా అదే దారిలో వెళ్తే ఈయనని నమ్ముకున్న వాళ్ళుకూడా గంగలో మునిగినట్టే. 
   తన  మాటలు  మంత్రి పదవిని, తాను ప్రజల కోసం త్యాగం చేసినట్టుగా  అర్ధాన్ని ధ్వనిస్తున్నాయి. తను  కాంగ్రెస్ పార్టీ లోనుంచి బయటికి ఎందుకొచ్చిందీ, సొంత పార్టీ ఎందుకు పెట్టిందీ అందరికీ కొన్ని లక్షల సార్లు చెప్పి ఉంటాడు.ఇప్పటివరకూ తన  కోసం తన సుఖాల్ని త్యాగం చేసుకున్నా,  ఇప్పటినుంచీ ప్రజల కోసం త్యాగాలు చేస్తే తప్పకుండా గుర్తిస్తారు. కష్టాలొచ్చినా నష్టాలోచ్చినా మాటకి  కట్టుబడి నడుచుకున్నవాడే చరిత్రలో మొనగాడిగా, నాయకుడిగా మిగులుతాడు!  అలా కాకపొతే అనాధగా మిగిలి పోతాడు!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి