6, డిసెంబర్ 2011, మంగళవారం

చంకలు గుద్దుకోవడం ఆపి ఇకనైనా పాలనపై దృష్టిపెట్టండి!



     ఒక తుఫాను వెలిసిపోయింది. అవిశ్వాసం వీగిపోయింది. పెట్టూపెట్టూ అన్నవాళ్ళూ,  నా ఇష్టం వొచ్చినప్పుడు పెడతా అన్నవాళ్ళూ అంతా చల్లబడ్డారు. ఎలాగైతేనేమీ కాంగ్రెస్ వారు పిఆర్పీ, ఎంఐఎం చలవతో  గండం గడిచి గట్టెక్కారు. అయితే సంబరం అప్పుడే అయిపోయిందా? లేదనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ లో  గోతికాడ నక్కలకి, రాబందులకీ లోటుండదు కాబట్టి!  ఇప్పటివరకూ బయటనుండి, లోపల నుండీ ఎప్పుడు ఎవరు కుర్చీ తన్నుకు పోతారో అని కాపలా కాసుకుంటున్న ముఖ్యమంత్రికి, చంద్రబాబు దయవల్ల బయటిపోరు వొదిలిపోయింది.  ఇక ఇంటి పోరు మిగిలింది.
          ఇక ప్రధానంగా అవిశ్వాసం పెట్టింది రైతు సమస్యల పైన అని చెప్పినప్పటికీ రైతుసమస్యలపై చర్చ వందోవంతు కూడా జరగలేదు.మొక్కుబడిగా విమర్శలు చేసుకోవడానికే సభని ఉపయోగించుకున్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడితో సహా  ఒకరి పై ఒకరు బురద చల్లుకుంటూ తమ నగ్న స్వరూపాల్ని బయట పెట్టుకున్నారు. సభ మొత్తం మీద ప్రజా సమస్యలమీద నిర్మాణాత్మకంగా ప్రసంగించి విమర్శలు చేసింది ఒక్క జేపీయే. చర్చ మొత్తం కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, మూడు పార్టీలచుట్టూనే తిరిగింది.  తెరాస తెలంగాణా గోస  వెలవెల బోయింది. మొత్తం మీద సభని చూస్తే ఇప్పుడున్న నాయకులకు  ప్రజలకు సక్రమ పరిపాలన అందించగల స్థాయి ఉందా అని అనుమానం కలగక మానదు. కనీసమర్యాదలు, హుందాతనం ఏ నాయకుడిలోనూ  ఏ కోశానా కనబడలేదు. రాను రానూ చట్టసభలలో కనీస విలువలు దిగజారుతున్న వైనం స్పష్టంగా కనబడుతోంది. తమ అధినాయకులే విలువలు విడిచిపెట్టి ఒకరిపై ఒకరు అసభ్యకర భాష, హావభావాలూ  ప్రయోగించుకుంటుంటే  వారి క్రింది నాయకత్వం వానరమూకలా చెలరేగిపోరా? రాజకీయాలంటే మర్యాదస్తులు అసహ్యించుకుంటున్నది ఇందుకేనేమో! 
     ఈ అవిశ్వాసం  పేరు చెప్పి లాభపడింది ఎవరైనా, పాపం తీవ్రంగా నష్టపోయింది మాత్రం అవిశ్వాసానికి అనుకూలంగా వోటేసిన  వైఎస్సార్ అభిమాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అనేది సుస్పష్టం.      
            సరే ముఖ్యమంత్రి గారు ఇకనైనా పరిపాలనపై దృష్టి పెడతారా? ఒకప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలికంగా అత్యవసరమైన విద్యుత్తు ని  శీతాకాలంలోనే రోజుకి ఎనిమిది గంటలు కోతపెడుతున్నారంటే ఇక ప్రభుత్వ మెందుకూ? కనీసం ప్రజలకి సహేతుకమైన కారణాన్ని కూడా వివరించలేని పాలకులు వుంటేనేం  వూడితేనేం. ఆలోచించండి!
  చర్చలో మాట్లాడుతూ  "నాయకులారా ! పారదర్సకంగా  ఉండండి, నగ్నంగా మాత్రం వొద్దు." అంటూ  జేపీ విసిరిన వ్యంగ్య బాణం సూటిగా దిగబడింది. సభ ఇంకొక రెండు రోజులు జరిగి వుంటే నిజంగానే భౌతికంగా కూడా  ఒకరి గుడ్డలొకరు వూడదీసుకునే వారే! ఏది ఏమైనా ఈ సమావేశాల పేరు చెప్పి నాయకుల నోటి దురద తీర్చుకున్నారు తప్ప,  ప్రజలకి వొరిగి చచ్చిందేమీ లేదు!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి