27, అక్టోబర్ 2011, గురువారం

కాంగ్రెస్ నేతల పీతలగంపలోకి మరో తెలంగాణ నేత

డాక్టర్.రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా  తయారైందన్నది  బహిరంగంగా అందరికీ కనబడుతున్నదే. ఆయన చనిపోయిన తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా పరిస్థితి మరింత దిగజారడమే తప్ప, ఫలితం లేదు. "విభజించి పాలించు " అనే బ్రిటీషు వాడి రాజ నీతి ని పుణికి పుచ్చుకున్న కాంగ్రెస్   హై కమాండు,  ఒక పక్క ఎద్దు పుండులాంటి తెలంగాణా సమస్య తో చెలగాటమాడుతూ, మరో పక్క స్వంత పార్టీలో గ్రూపుల్ని ఎగదోయడంలో భాగంగా డి.ఎస్. ను ఎమ్మెల్సీ పదవినిచ్చి రంగంలో కి దింపింది. పి.సి.సి. అద్య్హక్షుడిగా దింపి నప్పుడే డి.ఎస్. కు ఏదో ఒక పదవి వస్తుందని అందరూ అనుకున్నదే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి, పి.సి.సి. అధ్యక్షుల కోరికకి వ్యతిరేకంగా, కనీసం ముందుగా వారికి తెలియనీయకుండా  డి.ఎస్. ని ఎంపిక  చెయ్యడం, రాష్ట్రంలో కాంగ్రెస్స్ నాయకత్వాల దుస్థితినే  కాదు, మూడో కృష్ణుడి క్యూ లో ఇంకొకరిని నిలబెట్టారని  తెలియజేస్తోంది.
ఇప్పటికే తెలంగాణా ఎమ్మెల్యేలు, మంత్రులు, బొత్స ,చిరంజీవి, తదితర వర్గాలతో తలపడుతూ పరిపాలన పక్కన పెట్టిన ముఖ్యమంత్రి కి డి.ఎస్. ఎంపిక మరింత తలపోటు తెచ్చి పెట్టనుందని కధనాలు వెలువడుతున్నాయి. "తింగ రోడి  పెళ్ళాం వీధందరికీ  లోకువన్నట్టుగా"  ప్రస్తుతం కాంగ్రెస్ లో గల్లీ స్థాయి నాయకులు కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారే .  తప్పు లేదు!  ఆ పదవి  ప్రస్తుతం ఆ  స్థాయికి దిగజారింది. పాలన పట్టించుకునే నాధుడు లేడు. ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. తెలంగాణా తనకు సంబంధం లేదంటాడు. అంతా హై కమాండే  చూసుకుంటుందిలే అంటాడు. కానీ ఈయన కనీసం ఫైళ్ళు కూడా చూడరు. ఈయన చూడవలసిన ఫైళ్ళు ఒక మీటింగు గది నిండా పేరుకుపోయి ఉన్నాయంటే అది ఈయన పనితీరుకి అద్దం పడుతోంది.  
ఇప్పటికే ప్రమాణ స్వీకారోత్సవంలో "మంత్రిగా" ప్రమాణం చెయ్యమంటే "ముఖ్యమంత్రి గా" అని మనసులోని కోరికని బయటపెట్టుకున్న నేతలున్నారు. వారు కాకుండా చిరు, బొత్స ,కూడా ముఖ్యమంత్రి కావాలనే తమ మనసులోని కోరికని బయటపెట్టుకున్న వారే . ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవికి తానూ అర్హుడినే అని భావించే డి.ఎస్. హై కమాండ్ అండతో క్రియాశీల రాజకీయాల్లో కి రావడం కిరణ్ కి ముచ్చెమటలు పట్టించొచ్చు!  
  జగన్ దెబ్బకి జడిసి కాంగ్రెస్ హై కమాండ్ " చిరంజీవిని "తమలో కలిపేసుకుని "చిరుజీవిని" చేసేసారు. తనవారికి కనీసం ఈ ఎమ్మెల్సీ సీటైనా  దక్కుతుందనుకున్న చిరంజీవికి మొండిచెయ్యి చూపించారు. పదే పదే ప్రభుత్వాన్ని కాపాడానని గుర్తు చేస్తున్నా, ఈయన మొర వినే నాధుడు లేడు. యేరు దాటాక "బోడి జీవి" ని చేసిన కాంగ్రెస్ మార్కు రాజకీయం ఈయనకి బాగా అర్ధమయ్యే ఉంటుంది. 
ఈ పీతల గంప రాజకీయాలతో  నా ఆంద్ర ప్రదేశ్ సర్వ నాశన మవుతోందన్న బాధ ప్రతి సామాన్యుడి మదిలో నాటుకు పోయింది. దీని ఫలితం కాంగ్రెస్సే కాదు . ప్రతి రాజకీయ పార్టీ అనుభవించ వలసివుంటుంది. రాబోయే కాలంలో ఇది రుజువై తీరుతుంది!!

2 కామెంట్‌లు:

  1. "దీని ఫలితం కాంగ్రెస్సే కాదు . ప్రతి రాజకీయ పార్టీ అనుభవించ వలసివుంటుంది."బ్రష్టు పట్టి పోయిన రాజకీయాలను బాగా విశ్లేషించారు, ఫణిగారు!

    రిప్లయితొలగించండి