4, నవంబర్ 2011, శుక్రవారం

సంక్షోభంలో రాష్ట్ర రాజకీయ పార్టీలు

    రాష్ట్రంలో రాజకీయ వాతావరణం దివాళా దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. అన్ని రాజకీయ పార్టీల నాయకత్వాలూ సంక్షోభాల్ని ఎదుర్కొంటున్నాయి.  మనుగడ కోసం నానా తిప్పలు పడుతున్నాయి. అన్ని పార్టీలలోనూ కప్పగంతులు నిత్యకృత్యమైపోయాయి.ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యలేని స్థితిలో ప్రతిపక్షాలుంటే,   పార్టీ  ఎమ్మెల్యేలే పార్టీని వీడుతుంటే, రాష్ట్రంలో సొంత పార్టీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి , గవర్నర్ పాలన పెట్టవలసిన దుస్థితి, అధికార కాంగ్రెస్ పార్టీకి పట్టనుంది.
       ప్రధానంగా  దివంగత ముఖ్య మంత్రి  రాజశేఖర రెడ్డి అకాల మరణం తరవాత   కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారయింది.  రాష్ట్రంలో పార్టీనీ , ప్రభుత్వాన్నీఒంటిచేత్తో  నడిపించిన,  "వైఎస్"  మరణం ఆ పార్టీకి  అశనిపాతమయింది. ఆయన తరువాత పార్టీనీ, ప్రభుత్వాన్నీ నడిపించగల. ప్రజాదరణ గల నాయకులే  ఆ పార్టీకి కరువయ్యారు.  అంతటితో ఆగకుండా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు , ఆయన కొడుకు జగన్ ఆ పార్టీకి పక్కలో బల్లెంలా తయారయ్యాడు. జగన్ దెబ్బకి  ఒక దశలో  ప్రభుత్వమే కూలిపోతుందేమోననే  భయంతో చిరంజీవిని తమలోకలుపుకున్నా, ఎద్దుపుండులా మారిన తెలంగాణా సమస్య   ఆ పార్టీకి నిద్ర పట్టనివ్వడం లేదు.  "వైఎస్" బతికుండగా తెలంగాణా సమస్య తన చేయి దాటనివ్వకుండా అన్నీ  తానే  చక్కబెట్టుకుని ఎవరికీ ఏ విధమైన తలనొప్పీ  లేకుండా చూసుకున్నది వాస్తవం.   ఆయన మరణం తరువాత అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి కూడా, కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణా  సమస్యకి సరైన పరిష్కారం కనుక్కోలేక, పిల్లి మొగ్గలు వేస్తూ పీకలమీదకి తెచ్చుకుంది.  అధికారంఉన్నాకూడా కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలూ, ఎంపీలూ ఇతర పార్టీలలోకి క్యూ కడుతుంటే,  ఆ పార్టీ అధిష్టానం చేష్టలుడిగి చూస్తోంది.తన నేతలని అదుపులో పెట్టి సమర్ధంగా పార్టీని,ప్రభుత్వాన్నీ  నడిపించగల నాయకుడి కోసం కాగడా వేసి వెదుక్కుంటోంది
        ఇక గత ఎన్నికలలోనే అందలమెక్కాలనుకున్నతెలుగుదేశం అధినేత  చంద్రబాబు, చిరంజీవి దెబ్బకి ఖంగుతిన్నాడు. కనీసం ఈసారైనా పీఠం  దక్కుతున్దనుకుంటున్న సమయంలో, జగన్, తండ్రి పేరుతో పార్టీ పెట్టి , ఓదార్పు యాత్రకి  జనంలోకి వెళ్ళడం, సీమాంధ్రలోఅతనికి లభిస్తున్న ఆదరణా, చూసి, చంద్రబాబుకి కునుకు పట్టడం లేదు
    పోనీ  ప్రజలు ఆశిస్తున్న స్థాయిలో తెలుగుదేశం  పార్టీ ప్రజా సమస్యల పట్ల పోరాడుతోందా అంటే అదీలేదు. రాష్ట్రంలోప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టగల  అనేక సమస్యలున్నా, పోరాడడంలో ప్రతిపక్షం గా తెలుగుదేశం పార్టీ   విఫలమైందని నిస్సందేహంగా చెప్పవచ్చు.  దీనికి కారణం ఆ పార్టీ కింది స్థాయి నాయకులలోనూ ,కార్యకర్తల లోనూ అలుముకున్న నిరాసక్తతే. పార్టీలో ముఠాలూ, గత ఏడు సంవత్సరాలుగా అధికారానికి  దూరంగా ఉండడం, పార్టీ లోకి కొత్త రక్తం రాకపోవడం, తదితర కారణాల వల్ల  పార్టీ శ్రేణుల్నిచురుకుగా కదిలించ గలిగే నాయకులు  ఆ పార్టీకి కరువయ్యారు. ఈ సమస్యలన్నిటికీ తోడు తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించకుండా అధినేత ఆడుతున్న కళ్ళ గంతలాట వలన ఇరు ప్రాంతాలలోను ఆ పార్టీది  ఇరకాట పరిస్థితే.  రెండు కళ్ళ సిద్ధాంతంతో రెండు ప్రాంతాలలోనూ నేతల్ని పోరాటాలు చేసుకోమని చెప్పి  ఆయన చోద్యం చూస్తూ కూర్చున్నాడు. దీని ఫలితం రెండు ప్రాంతాలలోనూ అప్పుడే కనబడడం మొదలైంది.  ఇప్పటికే  తెలంగాణలో పార్టీ పరిస్థితి అధమ స్థాయికి దిగజారి పోయింది. కనీసం సీమాంధ్రలోనైనా పార్టీని నిలబెట్టుకోవాలనే ఆత్రుత, చంద్రబాబులో కనబడుతోంది. పార్టీనుంచి పోయే వారే  తప్ప కొత్తగా వచ్చే వారెవరూ కనబడడం లేదు. పార్టీని నడిపించడానికి, ఎన్టీఆర్ కున్నంత ప్రజాదరణ చంద్రబాబుకి లేకపోవడం కూడా మైనస్  పాయింటే.
ఇటువంటి పరిస్థితిలో  ఏదో విధంగా పార్టీని ఊపులోకి తీసుకోద్దామని ప్రజలలోకి వెళ్తున్న చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా తన పనితీరుపైన,  తన ఆస్తులపైనా వివరణ ఇచ్చుకోవలసి వస్తోంది.  ఖర్మ కాలి చంద్రబాబు పై  హైకోర్టులో  వైఎస్ విజయమ్మ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం గనుక  కోర్టు  పరిగణన లోకి తీసుకుని,  సిబిఐ ఎంక్వయిరీ వేస్తే, తెలుగు దేశం పరిస్థితి  కుడితిలో పడ్డట్టే .
                ఇక ఓదార్పు యాత్ర పేరుతో జగన్ ప్రజల మధ్య తిరుగుతూ తన పార్టీని బలోపేతం చేసే పనిలో బిజీగా ఉంటున్నాడు. రాజకీయ నాయకుడిగా అతడింకా రుజువు చేసుకోవలసి వుంది. ప్రజా సమస్యల మీద పోరాటంలో ఆ పార్టీ ఇంకా దీక్షల స్థాయిని దాటి ముందుకు పోలేదు. బహుశా సిబిఐ ఎంక్వయిరీ కలవరపెడుతూ ఉండొచ్చు. కానీ సిబిఐ తీరు చూస్తే అనుమానం కలగక మానదు. మొదట్లో సిబిఐ చేసిన హడావిడి, జగన్ డిల్లీ వెళ్లి వొచ్చిన తరువాత కనబడలేదు.  గాలంతా గాలి వైపు మళ్ళించారు. జగన్, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి మధ్యవర్తిత్వంలో కాంగ్రెస్ హైకమాండ్ తో రాజీ పడ్డట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
   ఇక పార్టీలో అప్పుడే వలసనాయకుల ముఠా తగాదాలు మొదలై పోయాయి.ముఠాల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ ఇతర పార్టీలకేమీ  తీసిపోదనే అనిపిస్తోంది.  జగన్ తన పార్టీ నాయకుల్ని ఏ విధంగా అదుపులో పెట్టగలడన్నది   వేచి చూడాలి.  ఏమైనా వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ భవిష్యత్తు -  జగన్ పార్టీని నడిపించే తీరు పైనా , ఆ పార్టీ  ప్రజా సమస్యల పై అనుసరించ బోయే వైఖరి పైనా,సిబిఐ ఎంక్వయిరీ పైనా ఆధారపడిఉండొచ్చు. అంతవరకూ ఈ పార్టీ కూడా మిగిలిన పార్టీలకంటే భిన్న్నమైనదేమీ కాదు. 
      ఇక  ప్రస్తుత పరిస్థితిలో ఉద్యమ పార్టీగా  తెరాస పార్టీ పరిస్థితి కొంచెం మెరుగు. తెలంగాణా వచ్చినా రాకున్నా వారి నాయకుడు తాను కోరుకున్న దిశగా అడుగులు వేస్తున్నాడు. తెలంగాణా లో ఏకైక రాజకీయ పార్టీగా అవతరించడానికి చురుగ్గానే పావులు కదుపుతున్నాడు.  తెలంగాణలో మరే రాజకీయ పార్టీ కి అస్తిత్వం లేకుండా చెయ్యడానికి, ఉద్యమాన్ని తెలివితేటలుగా వాడుకుంటున్నాడు.  ఉద్యమకారుల ముసుగులో తన కార్యకర్తల్ని ఇతర పార్టీల నాయకుల మీదకి ఉసిగొల్పి, వారికి తన పార్టీ తప్ప గత్యంతరం లేదనే పరిస్థితి కల్పిస్తున్నాడు.  తాజాగా తెలుగుదేశం , కాంగ్రెస్స్ పార్టీల నుండి దూకిన "బంగీ జంప్" లే  దీనికి నిదర్శనం. అతి త్వరలోనే మరికొంత మంది దూకడానికి సిద్ధంగా ఉన్నారనేది అన్ని పార్టీలనీ కలవరపెడుతోంది. దూకిన తరువాత తమ స్థానమెక్కడనే మీమాంసలో కొంత మంది కొట్టుమిట్టాడుతున్నట్టు వార్తలు తెలుపుతున్నాయి. అది వాస్తవమే కావొచ్చు. ఎందుకంటే రాబోయే ఎన్నికలలో  తెలంగాణలో  కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీల పరిస్థితి అధ్వాన్నంగా ఉండబోతోందన్నది స్పష్టంగా కళ్ళకి కనబడుతున్న తరువాత, "పదవి కోరుకునే ఏ నాయకుడు "మాత్రం ఆయా  పార్టీలలో ఉండగలడు?
     రాబోయే ఎన్నికలలో తెలంగాణాలోని అన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు గంప గుత్తగా గెలిచి, అటు కేంద్రంలో తానూ, " తెలంగాణా రాష్ట్రంలో" తన కుటుంబ సభ్యులూ, ఎదురులేకుండా పరిపాలించాలనే వ్యూహంతో దూసుకు పోతున్న కేసీయార్ ని  సమర్ధంగా ఎదుర్కొగలిగే నాయకులెవరూ తెలంగాణలో ఏ పార్టీ లోనూ  కనబడడం లేదు.
   ఇక రాష్ట్రంలో  మిగిలిన ప్రతిపక్షాలు బీజేపీ, కమ్యూనిస్టులూ, నామ మాత్రులే. కమ్యూనిస్టులు పోరాట మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టి, మీడియా మార్గంతో సరిపెడుతున్నారు.
  ఒక పక్క కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీజిలు ధరలు ఇష్టం వొచ్చినట్లు పెంచుకు పోతుంటే, రాష్ట్రంలో నిత్యావసర  వస్తువులు,కూరలు, బియ్యం ధరలు అంతు లేకుండా పెరిగిపోతుంటే,సామాన్యుడు అల్లాడుతున్నాడు! రాజకీయ వ్యవస్థ పట్ల అసహ్యాన్ని పెంచుకుంటున్నాడు! వచ్చే ఎన్నికల్లో వోటెయ్యడానికి ఎవరు మిగిలారా అని బెంగపడుతున్నాడు!  ఇప్పటికైనా రాజకీయ నాయకులు కళ్ళు తెరిస్తే మంచిది!!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి