20, డిసెంబర్ 2013, శుక్రవారం

దొంగలం కాదని జనాన్ని నమ్మించలేకపోయాం! అందుకే ఓడిపోయాం!

          నిన్న ఢిల్లీ లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ గారు ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో ఓటమిపై విశ్లేషిస్తూ ప్రభుత్వవిధానాలు(?), విజయాలు(??), పధకాల విషయంలో ప్రజల్ని నమ్మించలేకపోయాం అని సెలవిచ్చారు . (ఈ లింకు చూడండి)
    ఇది వింటుంటే మన తెలుగులో చాలా విరివిగా వాడే ముతక సామెత గుర్తుకొస్తోంది . ఇక్కడ వ్రాయడం బాగుండదు కానీ ఈ పాటికి మీకు  అర్ధమయ్యే  వుంటుంది . 
      ఒక ప్రక్క  పెరిగిపోతున్న ధరలతో  బ్రతకడమే కష్టమైపోతూ ఈ ప్రభుత్వం ఎప్పుడు ఊడుతుందిరా భగవంతుడా అని ప్రజలు  గోల పెడుతున్నా, కేంద్రంలో, రాష్ట్రాల్లో మీ ప్రభుత్వాలు  ప్రధానమంత్రితో సహా అవినీతి ఊబిలో కూరుకుపోయి ఫైళ్ళనే మాయం చేసేసే స్థాయికి దిగజారిపోయినా, రాష్ట్రాల ఎన్నికల్లోజనం మిమ్మల్ని  చీపురుకట్టలతో ఊడ్చిపారేసినా ఇంకా మీకు  కళ్ళు తెరవడలేదే! హే భగవాన్ !  దేశ రాజధానిలోనే స్త్రీలకి రక్షణ కల్పించలేక పోయిన వీళ్ళ అసమర్ధతనీ, నెలకొకటిగా బయటపడుతున్న వీళ్ళ అవినీతి రొచ్చుకంపునూ, ఆకాశాన్నంటుతున్న ధరల్ని అదుపుచెయ్యలేని వీరి చేతగానితనాన్ని  గుర్తెరిగే  జ్ఞానాన్నివీరికి కలగజెయ్యి తండ్రీ!
   (ఈ పోస్ట్ వ్రాస్తుండగానే టీవిలో స్క్రోలింగ్ వస్తోంది . రిలయెన్స్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ కి ప్రభుత్వం ఇస్తున్న రేటుని రెట్టింపు చేస్తూ కేబినెట్ నిర్ణయం చేసిందనీ, సాక్షాత్తూ పెట్రోలియం మంత్రి అభ్యంతరం చెప్తున్నా కేబినేట్ సహచరులు ఆమోదించారనే  వార్త! ఇంకొక కుంభకోణం వీరి ఖాతాలో చేరినట్టే! ) 
       దేశంలో పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భణం గురించి ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ అది పెద్ద విషయం కాదని, చాలామంది ఆదాయం ద్రవ్యోల్భణం కంటే వేగంగా పెరిగిందని సెలవిచ్చారట!  ఈ రకమైన మైండ్ సెట్ తో వున్న నాయకులు ఈ దేశాన్నీ ప్రజల్నీ ఏం ఉద్ధరిస్తారో అర్ధం చేసుకోండి!
      రోజుకో అవినీతి కుంభకోణంలో వేలు,లక్షలకోట్ల రూపాయల ఆస్తులు మీకు,  మీ అండతో అడ్డగోలుగా కాంట్రాక్టులు పొందిన వారికీ ఆదాయాలు వేగంగానే పెరిగాయి గానీ ఈ దేశంలో సామాన్యుడి ఆదాయం గొర్రెకి బెత్తెడు తోకలాగే వుందనే వాస్తవం మీ కళ్ళకు కనబడదు .  ఎంతో గొప్పగా చెప్పుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీతాల పెంపుదల స్తంభించి పోయింది . బజార్లో వంద రూపాయలు ధరల్లో పెరిగితే, పారిశ్రామిక కార్మికులకు  ఆరునెల్లకోసారి విదిల్చే VDA  పది రూపాయలు పెరుగుతుంది .  ప్రభుత్వ ఉద్యోగుల DA పరిస్థితి కూడా ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు. ఇక ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకుని బ్రతికే ప్రజల పరిస్థితి మరింత దారుణంగా వుంది . మధ్యతరగతివాడు కక్కలేక మింగలేక బ్రతుకుతున్నాడు . అయినా  మీకు  కళ్ళు కనబడడం లేదు . నిజాల్ని గమనించి మీ తప్పుల్ని అంగీకరించి ఆత్మ విమర్శ చేసుకుంటారని ఆశిస్తున్న(?) జనానికి  మీ నిప్పుకోడి వేషాలు మరింత బాగా అర్ధమవుతున్నాయి . ఈ సారి మరింత గట్టిగా చెంప ఛెళ్ళు మనిపించడం ఖాయం! తయారుగా వుండండి!
       మీరొక  దోమనో, ఏనుగునో  ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినంత మాత్రాన చెవిలో  పువ్వుపెట్టుకుని  మీకు గుద్దేస్తారనుకోకండి!  మీ ఏనుగులు "  తెల్ల "  ఏనుగులని  మాకు తెలుసు . ఇక  దోమ "  దొడ్డిలో వున్నా ఒకటే! ముడ్డిలో వున్నా ఒకటే!  పీకేదేం ఉండదన్న"   సంగతి కూడా తెలుసు!      జై హింద్ !!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి