15, నవంబర్ 2011, మంగళవారం

సైకిలు టైరు పగిలినట్టే!

   చంద్రబాబు ఆస్తులపై వై ఎస్ విజయమ్మ రిట్టు హైకోర్టు స్వీకరించి సమగ్ర దర్యాప్తుకి ఆదేశించింది. హైకోర్టు నిర్ణయం అత్యంత సమంజసమైనదే కాక  ప్రజలకి ఉపయోగపడేది కూడా.   రాష్ట్ర రాజకీయాల్లో ఇదో కీలక మలుపుగా చెప్పుకోవచ్చు.
  ఇప్పటికే సైకిలు రెండు టైర్లలో ఒక టైరుకి రోజుకో  మేకు దిగుతోంది. తొక్కే పరిస్థితి లేక చంద్రబాబు తన సైకిల్ని నడిపించుకుపోతున్నాడు. ఇప్పుడిక  సైకిలు పక్కన పెట్టి "చిప్పకూడు" (వారి భాషలోనే)  తినడానికి జైలుకెప్పుడు వెళ్తానా! అని ఎదురు చూడడం ఈయన వంతు!
     దేశంలో తన కుటుంబ ఆస్తులతో సహా తన ఆస్తులన్నీ ప్రకటించిన మొట్టమొదటి నేత తానేనని  చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. హజారే అవతారంలో ప్రవచనాలు కూడా చెపుతున్నారు. అయితే ఆస్తుల్ని ప్రకటించారు సరే, అసలు ఆ ఆస్తుల నిజ విలువ ఎంత? అవి అక్రమ మైనవా? సక్రమ మైనవా ?ఎప్పుడు సంపాదించారు? ఎలా సంపాదించారన్నది ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయాన్నే సిబిఐ విచారణ తేల్చనుంది.
    ఎదుటివాడికి తగిలినప్పుడు చంకలు గుద్దుకుని ఇకిలించిన తెలుగు దేశం నాయకులు ఇప్పుడు తీపులు తీస్తున్నారు. సిబిఐ ఎంక్వయిరీ పడగానే జగన్కి చిప్పకూడేనని  తారీకులతో సహా చెప్పిన చంద్రబాబు, ఇతర తెలుగుదేశం నాయకులకి నోరు పెగలడం లేదు.  జగన్ పై  కధలు కధలుగా  పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కొన్ని పత్రికలూ చానళ్ళూ ఇప్పుడు గతుక్కుమన్నాయి.  ఇక సాక్షాత్తూ ఈనాడు,ఈటీవీ యజమాని పైనే విచారణ జరగనుంది. అయితే వీరంతా తమ సర్వశక్తులూ వొడ్డి  సుప్రీం కోర్ట్ కెళ్ళి స్టే తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇది ఆశ్చర్య కరమైన విషయమేం కాదు. దొంగ ఎప్పుడూ దొరకడానికి ప్రయత్నించడు కదా? కాకపోతే  ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడిపైనైనా  ఇటువంటి ఆరోపణలొచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే హుందాగా ఉంటుంది. లేకపోతే జీవితాంతం ఆ మచ్చ, మచ్చగానే మిగిలిపోతుంది. జనం ముందు కెల్లినప్పుడల్లా ఈ "జమ్మజచ్చకి"  సమాధానం చెప్పాల్సి వుంటుంది.
     అయితే  జరుగుతున్నఈ పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చంకలు గుద్దుకోనేంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సమస్యలతో కుడితిలో పడి కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తన ప్రధాన ప్రత్యర్ధులిద్దరి పైనా సిబిఐ విచారణలు జరగడం రాజకీయంగా కలిసొచ్చే అంశమే. ఎలాగూ సిబిఐ తమ చెప్పుచేతల్లోనిదే గాబట్టి ఈ విచారణని ఎలాగైనా ఉపయోగించుకోగలరు. ఇక మిగిలింది"టియారెస్." "కెసియార్."  వారి పైన కూడా ఎవరొకరు ఒక రిట్టు పడేస్తే కాంగ్రెస్ కి ఓ పనైపోతుంది! ఆ తరవాత వంతు ఎలాగూ కాంగ్రెస్ వారిదే కాబట్టి జనానికి ఆనందమూ మిగులుతుంది!!

1 వ్యాఖ్య: