16, నవంబర్ 2011, బుధవారం

ఈయనవి ఉత్తర కుమార వాగ్దానాలేనా?

తెలంగాణలో సకలజనుల సమ్మె జరుగుతున్నప్పుడు ఆ వంకన మన సి.ఎం.గారు రాష్త్రమంతటినీ అంధకారంలో పడుకోబెట్టారు. అన్ని పరిశ్రమలు నెల రోజుల పైనే ఉత్పత్తి నష్ట పోయాయి.మూసివేత కారణంగా కార్మికులు జీతాలు నష్టపోయారు. ఇక ప్రజలు అనుభవించిన బాధలు వర్ణనాతీతం.పల్లెల్లో మరీ దుర్భరంగా గడిచింది.  అసలీ రాష్ట్రంలో ప్రభుత్వం వుందా అనుకునేలా చేసారు. కనీస ముందు జాగ్రత్త తీసుకుని ఉండుంటే ప్రజలు అన్ని  ఇబ్బందులు పడి ఉండేవారు కాదు.  తెలంగాన నాయకులు అప్పటికే నెలరోజుల ముందునుండే  సమ్మెకి దిగుతామని హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందుజాగర్త తీసుకోని ఫలితం అందరం  అనుభవించాం.
   సరే అప్పుడంటే సకలజనుల సమ్మె. మరి ఇప్పుడే సమ్మె? సమ్మె విరమణ జరిగిన తరువాత కొద్ది రోజులు కరెంట్ సక్రమంగా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు (గోదావరి జిల్లాల్లో, మిగిలిన జిల్లాల సంగతి తెలీదు) ప్రతి రోజూ కనీసం ఆరు గంటల సేపు కరెంట్ తీసేస్తున్నారు. ఏమంటే పవర్ కట్. ఎవడూ కారణం చెప్పడు.శీతాకాలం  మొదలై ఒక పక్క విద్యుత్ వినియోగం తగ్గినా ఇన్ని గంటలు పవర్ కట్ ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడంలేదు. అడిగే నాధుడూ లేడు.  అధికార పక్షులు తెలంగాణా_సమైక్యాంధ్ర కుడితిలో పడి కొట్టుకుంటుంటే, ప్రతిపక్షులు ఒకళ్ళ ఆస్తులు ఒకళ్ళు లెక్క పెట్టుకోవడంలో బిజీగా ఉన్నారు.
          సి.ఎం.గా సీట్లో కెక్కింతరవాత ఈయన శ్రద్ధగా అమలు చేసిన పధకమేదైనా ఉందంటే అది " పవర్ కట్" పధకమే. ఉన్న పధకాల్నే సరిగా అమలుచెయ్యలేక చేతులెత్తేసిన ఈయన కొత్త పధకాలు ప్రవేశ పెడుతున్నారు. ఈయన అత్యంత ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన కిలో రూపాయికే బియ్యం పధకం ముక్కిపోయి పురుగులు పట్టేసింది. రచ్చబండ రొచ్చుబండయి పోయింది.ఎక్కడకెళ్ళినా జనం ఛీత్కారాలూ చీదరింపులూ ఎదురవుతున్నాయి. ఇంతకు ముందు జరిగిన రచ్చబండలో ఇచ్చిన హామీలకే ఇంకా దిక్కు లేదు. మళ్ళీ రచ్చబండనగానే జనం రచ్చ రచ్చ చేసేస్తున్నారు.
  ఇక యువకిరణాలు!!  నిరుద్యోగులకి లక్ష ఉద్యోగాలు. నిరుద్యోగులు నిజమే కాబోసనుకుని ఎగబడుతున్నారు. ఈయనకి ఉద్యోగాలు ఎక్కడనుంచి పుట్టుకొస్తాయో తెలిసినట్టు లేదు. ( వై.ఎస్. ఈయనని స్పీకర్ కుర్చీకే పరిమితం చేసింది ఇందుకే కాబోలు) ఆర్భాటంగా వాగ్ధానమైతే   చేసేసారు గానీ,  పాపం అధికారులు ప్రయివేటు పరిశ్రమల యజమానుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు.ఏవో కొన్నయినా ఖాళీలు చూపించమని వేడుకుంటున్నారు. ఒక పక్క పరిశ్రమలకి విద్యుత్ కోత పెట్టి,  ఉన్న పరిశ్రమల్ని మూయిస్తూ, ఉద్యోగాలు  ఎక్కడ నుంచి వస్తాయో ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. మీ  విద్యుత్ "కోతలకి"  పంటలెండి పోయి, గ్రామాల్లో  వ్యవసాయ కూలీలు ఉన్న పనులు కోల్పోతున్నారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఉన్న గుడ్డలూడగొట్టకుండా  చూడ మని వేడుకుంటున్నారు.  దయచేసి మీరు ఇప్పటికైనా పధకాల ప్రగల్భాలు మాని, నేలమీద చూడమని, వాతలు పెట్టుకోడానికి  ప్రయత్నిచవద్దనీ, మరీ మరీ కోరుకుంటున్నాము!!                
        

1 కామెంట్‌:

  1. హై వాళ్లకు ఠంచన్ గా నాలుగ్గంటలు కోత పెట్టి వాతపెడుతున్నారు దారుణంగా.

    రిప్లయితొలగించండి