1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

శంకరన్నా! ఇట్ట జరిగిందేటే!

    రాష్ట్ర మాజీ మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి.వెంకట స్వామి అల్లుడు, కాంగ్రెస్ ఎంపీ జి.వివేక్కి బావ; ఇంత బ్యాక్ గ్రౌండ్ వున్న శంకరరావు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుమనం సైనిక పాలనలో ఉన్నామా అనిపించింది. శంకరరావు నేరం చేసారా లేదా అనేది విచారణలోఖచ్చితంగా రుజువుకావలసిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయనని (కేవలం ప్రశ్నించడానికి) పోలీసులు తీసుకెళ్ళిన  విధానం చూస్తే మనం ఎమర్జెన్సీలోనో, హిట్లర్ పరిపాలనలోనో ఉన్నామా అనిపిస్తోంది.
       ఒక శాసనసభ్యుడి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు, ఆయనని  ఒక జేబుదొంగనో, చిల్లరరౌడీనో లాక్కు వెళ్ళినట్లుగా కనీసం బట్టలు కూడా వేసుకోనీయకుండా తీసుకెళ్లడం ఈ రాష్ట్రంలో పౌరులకు కనీస మానవహక్కులు లేవా అనిపిం చింది. పోలీసుల ధైర్యం చూస్తే  దీని వెనుక  ఖచ్చితంగా ముఖ్యమంత్రి హస్తం ఉందనే అనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికే  మంత్రిగా వున్నశంకరరావుకూ ముఖ్యమంత్రికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే ఉంది. ఇటీవల చాలాసార్లు శంకర్రావు బహిరంగంగానే ముఖ్యమంత్రీ,  సోదరుల మీద ఆరోపణలు చెయ్యడం కోర్టులో కేసులు వేయడం వగైరా జరిగాయి. ఈ వ్యక్తిగత కక్షలే పోలీసుల ఈ తీరుకు కారణమనేది నిస్సందేహం. అంతేగాకుండా కేవలం అధిష్టానం అండతో సరాసరి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న కిరణ్ కుమార్ రెడ్డి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన వ్యతిరేకుల్ని చెప్పుచేతల్లో పెట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దానికి ఉదాహరణే బొత్స మద్యం కేసు, మోపిదేవి, ధర్మాన,అసదుద్దీన్, తాజాగా శంకరరావు. అయితే వీరందరూ నిర్దోషులే అని చెప్పలేము గానీ, వీరిలో కొందరిపై కేసులు మోపిన విధానం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందనే అనుమానం. అసదుద్దీన్ కేసునే తీసుకుంటే, ఇటీవలే ఎమ్మైఎమ్ పార్టీకీ, కాంగ్రెస్ పార్టీకీ చెడి, వారు సూటిగా ముఖ్యమంత్రి మీద విమర్శలు, ఆరోపణలూ చేసారు. ఇది జరిగి నెలరోజులు కాకుండానే అసదుద్దీన్ పై ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం నమోదైన కేసుపై ఇప్పుడు అరెస్టు చేసి జైలుకు పంపించారు.ఇంతకాలం ఎందుకు అరెస్టు చెయ్యలేదు? ఆయనేమైనా విదేశాల్లో ఉన్నాడా? ఇవన్నీ చూస్తుంటే  డీఎల్ రవీంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా త్వరలో ఏదో ఒక కేసులో అరెస్టవుతారనే అనిపిస్తోంది. హు!  నాయకుల పరిస్ఠితే ఇలా వుంటే ఇక సామాన్యులకి  దిక్కెవ్వరు?
              ఏది ఏమైనా శంకర్రావును  తీసుకెళ్ళిన విధానంలో బాధ్యులైన పోలీసు అధికారులపై చర్య తీసుకోవడానికి ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడమే గాక ఈ రాష్ట్రంలో పౌరుల హక్కుల్ని గౌరవిస్తామనే సందేశాన్ని ఇవ్వవలసి ఉంది!!

4 కామెంట్‌లు:

  1. అంత బ్యాక్ గ్రౌండ్ వున్న నేత, అంత అనుభవం వున్నా నాయకుడు వారెంట్ తో వచ్చినపుడు చట్టాన్ని గౌరవించి పోలీసులకు సహకరించి వుంటే బాగుండేది. సహకరించి వుంటే, వారు సగౌరవం గా తీసుకెళ్ళేవారు. పోలీసులు కావాలని ఇలా బట్టలు లేకుండా తీసుకేల్లెంత మూర్ఖులని నేను అనుకోవట్లేదు,
    ఈ ఘటనలో పోలీసులను తప్పుబట్టడం అంత సబబు గా లేదు.

    --
    Police

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోలీసులపై మీకున్న నమ్మకాన్ని నేను తప్పుపట్టను.కానీ ఈరోజు పత్రికల్లోవచ్చిన వార్తలు చూస్తే పోలీసులు కొంచెం అతిగానే ప్రవర్తించారనిపిస్తోంది.ఈసంఘటనని సాక్షాత్తూ డిప్యూటీసిఎం,మంత్రీ పీసీసీ అధ్యక్షుడూ అయిన బొత్స కూడా తప్పుబట్టిన విషయం గమనించండి.అందరు పోలీసులూ ఒకే రకంగా వుండకపోవచ్చుగానీ, ఈ విషయంలో కొంచెం సమ్యమనం పాటించివుండవలసింది.ఈరోజు పత్రికల లింకులు చూడండి.
      http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=4
      http://epaper.sakshi.com/Details.aspx?id=1650242&boxid=25521710
      మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
    2. ప్రతి విషయంలోనూ రాజకీయ లాభ నష్టాలను చూసే రాజకీయ నాయ'కుల' పేపర్ స్టేట్మెంట్స్ ను ప్రస్తావించినందుకు సంతోషం ఫణి గారు.
      సదరు మాజీ మంత్రివర్యులు చట్టాన్ని గౌరవించి, పోలీసులకు సహకరించి వుంటే ఆయన హుందాతనానికి మెచ్చి పోలీసులు కుడా గౌరవించేవారు.
      చట్టం ప్రెషర్ పోలీసుల మీద వుండటం తో వారు వారి పని చేయక తప్పదు.
      చట్టం గురింఛి అవగాహనా వున్న చట్ట సభల సభ్యులు చట్టాన్ని గౌరవించక పోవడం, ప్రతి విషయాన్నీ కుల ద్రుష్టి తో చూసే నాయకుల మాటలు శాంతిభద్రతలను మరింత దిగాజార్చుతాయి.

      --
      పోలీస్

      తొలగించండి
    3. మీరు చెప్పింది నూటికి నూరుశాతం నిజమే! కానీ చట్టం ప్రెషర్ అనేకంటే రాజకీయనాయ"కుల" ప్రెషర్ ఎక్కువయ్యి అనుకుంటున్నాను.Any way once again thanks for your comments.

      తొలగించండి