9, ఫిబ్రవరి 2013, శనివారం

నువ్వు చేసిన పాపం నీ బిడ్డ చెయ్యడా?

      మానవసంబంధాలకు అత్యంత విలువనిచ్చే మన నాగరికత గురించి ఇప్పటికీ మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ప్రత్యేకించి హైందవ సమాజంలో కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యం వుంటుంది. మన తెలుగువారిలో అయితే మరీనూ .  అమ్మ,నాన్న,అన్న,తమ్ముడు,అక్కా చెల్లెలు, బాబాయిలు,బావలు,మామయ్యలు,అత్తలు,మరదళ్ళు, ఈ బంధాలు, బాంధవ్యాలు తలుచుకుంటే మనసు పులకరిస్తుంది. కానీ పాశ్చాత్య నాగరికతల ప్రభావమో, మన పెంపకాల్లో లోపమో, మన కుటుంబ బంధాలు అత్యంతదారుణంగా క్షీణిస్తున్నాయని చెప్పుకోక తప్పదు.
         పిల్లలు ఎంత ఎదిగినా పెద్దవాళ్ళు వాళ్ళ పట్ల తీసుకునే జాగ్రత్తలు, తమ కోర్కెలు చంపుకుని పిల్లల కోసం కూడబెట్టేవాళ్ళనీ  వాళ్ళ కోసం ఏం  చెయ్యడానికైనా సిద్ధపడే  తల్లితండ్రులనీచూసాం.  వారిని చదివించి గొప్పవాడిని చెయ్యాలని ,వాళ్ళు భవిష్యత్తులో ఏ ఇబ్బందులూ పడకూడదని తమ సర్వ శక్తులూ  ఒడ్డి ప్రయోజకుల్ని చేసిన ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల చేతిలో దగాపడి, వృద్ధాప్యంలో వారు అనుభవిస్తున్న వేదనకు ప్రతిరూపం ఈ రోజు పత్రికలో వచ్చిన  ఈ ప్రశ్న.
         రెక్కలొచ్చిన తరువాత పక్షులెగిరి పోతాయి.పశువులూ అంతే. మనుషులు కూడా అంతేనా? 
వారికి పుట్టిన క్షణం నుంచి వాళ్ళు నిరంతరం నీ గురించే ఆలోచించారు. నువ్వు పక్క తడిపితే ఆ తడిలో వారు పడుకుని, నిన్ను పొడిగా పడుకో బెట్టారు. వారి జిహ్వ చంపుకుని నీ కోసం దాచిపెట్టి నీకు తినిపించి ఆనందించారు. తమ కోర్కెలతో సహా సర్వస్వం నీకోసం త్యాగం చేసారు. చివరికి నువు దానవుడివైపోయినా నీకోసమే పరితపిస్తున్నారు. ఆహా ఏమి జన్మ నీది! ఇంకా ఇటువంటి వాళ్ళు ఈ భూమిమీద ఉంటే  పుడమి తల్లికి భారమే! నా ఉద్దేశ్యంలో ఇటువంటి కొడుకు కోసం పరితపించే కన్నా వూరకుక్కని పెంచుకుంటే మేలు.  
                   
    అయితే నాణానికి రెండో వైపు చూద్దాం. కొంతకాలం క్రితం ఎక్కడో చదివాను. ఒక కొడుకూ తల్లీ ఆటోలో సంభాషించుకుంటున్నారు.
         ఈ వయసులో మమ్మల్ని ఒంటరిగా వొదిలి పెట్టి అంత దూరం వెళ్ళడం అవసరమేంట్రా ........ తల్లి. 
    తప్పదమ్మా ఇప్పుడు వెళ్లక పోతే ఇంక నాకవకాశంరాదు. రాకరాక వచ్చింది. నన్నాపకమ్మా ......కొడుకు.      అదేంట్రా, తల్లీ తండ్రీ అనే బాధ్యత లేదేంట్రా నీకూ? మమ్మల్ని వొదిలేసి విదేశాలకి పోతానంటావేంట్రా?... తల్లిబాధ .
          అమ్మా  ఏం  మాట్లాడుతున్నావ్ ! తల్లీ తండ్రీ అనుకోడానికి మీరు చేసిందేమిటీ? నాకు ఊహరాకుండానే  హాస్టల్లో పడేసారు.వారానికో పదిహేను రోజులకో ఒకసారి, రెండుమూడు గంటలుండి చూసి పోయేవారు.అందరి పిల్లల్లాగే నేనూ తల్లిదండ్రులతో ఉండాలని ప్రతిరోజూ కుమిలిపోయేవాడ్ని. కానీ నా బాధ మీరేం తెలుసుకున్నారు. ఇంకా చదవాలి ఇంకా చదవాలి, వేలు కడుతున్నాం అనడమే తప్ప నా గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా?     నన్నునాశనం చేసారు . నేను బాగా చదివి డబ్బు సంపాదించాలని  ఆలోచించారే తప్ప నాకూ అమ్మానాన్నలతో ఉండాలని, అన్నా చెల్లెళ్ళతో ఆడుకోవాలని ఉంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? అనుబంధం,ఆప్యాయతా అంటే ఏమిటో నాకు తెలీదు. తల్లిదండ్రుల ప్రేమంటే తెలీదు. ఇంతకాలం నేను దగ్గర లేక పోయినా మీకు లేని బాధ ఇప్పుడు నాకెందుకూ? ఇప్పుడు కొత్తగా దూరమై పోయేదేముందీ? చిన్నప్పటి నుంచీ మీకు దూరంగానే ఉంచారు కదా!
      అదికాదు బాబూ!  నీ కోసమే కదరా, నువ్వు గొప్ప ఉద్యోగం సంపాదించాలీ  బాగుండాలనే కదరా ఆలోచించాం.........తల్లి 
    నేను చేస్తున్నదీ అదే కదా మరి. ఎందుకడ్డు చెప్తున్నావ్ . బాగుండాలనే కదా అక్కడికి పోతున్నది.ఇంక విడిచి పెట్టు.
                              సన్నగా తల్లి రోదన ....................
                                                           సాక్షి డైలీ ఫీచర్ లో వచ్చిన  ప్రశ్నఈ లింకులో  చూడండి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి