20, ఫిబ్రవరి 2013, బుధవారం

నాయుడు గారు - రెండువేల కిలోమీటర్లూ!


       ప్రజా సమస్యలు తెలుసు కోవడం కోసం చంద్రబాబునాయుడు  మొదలుపెట్టిన "మీ కోసం?" నడక రెండువేల కిలోమీటర్లు పూర్తయ్యింది. బహుశా దాటిపోయి కూడా ఉండొచ్చు . అయితే మీకోసం అని మన పేరు చెప్పి, మన సమస్యలు తెలుసుకోవడం కోసం  ఆయన మొదలు పెట్టిన ఈ నడక ఎవరికోసమో ప్రజలకు తెలుసు. ఆ మాత్రం అర్ధం చేసుకోలేని పరిస్థితిలో ఎవరూ లేరు.అయితే ఈ నడకలో ప్రజా సమస్యల మాటెలా వున్నాతన అధికార హయాంలోతాను చేసిన పనుల మీద పశ్చాత్తాపం వెలిబుచ్చి, క్షమించి మళ్ళీ అధికారం కట్టబెట్టమని ప్రజలకి మొరపెట్టుకున్నారు. ఆయన వైఎస్సార్ పార్టీ మీద ప్రధానంగానూ, కిరణ్ కుమార్ రెడ్డి మీదా వ్యక్తిగత  విమర్శలు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. మొత్తం మీద ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడుతున్నది తక్కువేనని చెప్పుకోవాలి .
           థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈయనకు  ప్రజల సమస్యలు అర్ధం కాకపోడానికి ఏముందనీ?అధికధరలు,విద్యుత్, గ్యాస్, పన్నులపెంపు, నిరుద్యోగం, ఎవడికి తెలియని సమస్యలు ఇవి? వీటి మీద మీరు, మీ పార్టీ చేస్తున్న పోరాటం ఏమిటీ??  అసెంబ్లీ పెడితే  ధర్నాలూ వాకౌట్లతో కాలక్షేపం చేసేస్తారు . నువ్వేం ఊడ బొడిచావంటే , నువ్వేం ఊడ బొడిచావంటూ తిట్టుకోవడం తప్పించి ప్రజాసమస్యల ఊసే ఎత్తరు . "ప్రతి పక్షాలు "అంటేనే అర్ధం మారిపోయింది .ప్రతిపక్షాలు కేవలం చెట్టు మీద పక్షుల్లాగా మారిపోయారు. ఎన్నికలు వచ్చే వరకూ ఆ చెట్ల మీదనే కూర్చుని అరవడం . ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే క్రిందికి దిగడం . నాయకులెవరూ ప్రజా సమస్యలపట్ల రాజకీయ పార్టీలు చెయ్యవలసిన పోరాటాలు చెయ్యగల, చేయించగల  స్థితిలో లేరు . అది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.
       ఈ పాద యాత్రలో ఒక్కొక్కసారి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయి. పాదయాత్ర వల్ల తనకు "  షుగర్ వ్యాధి వొచ్చిందనీ," "  కార్యకర్తలు ఈ ఉత్సాహం 2009 లోనే చూపించి వుంటే తాను ముఖ్యమంత్రి నయ్యే వాడిననీ".. ( ఈ నడక 2009 లోనే నడిచి వుంటే బాగుండేదేమో అని కార్యకర్తలు కూడా అనుకుని వుంటారు ).  ఇలాంటి వ్యాఖ్యల అర్ధం కనీసజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుస్తోంది.  అదే కాకుండా నిన్న ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో తానే అత్యంత నిజాయితీ పరుడిననీ తనమీద 50 మంది జడ్జీలూ 25 ఎంక్వయిరీలూ జరిగినా ఏం రుజువుకాలేదనీ చెప్పుకున్నారు. కానీ ప్రజలు అది నమ్మే పరిస్థ్తితిలేదు . ఎందుకంటే మీరు ఏ ఎంక్వయిరీనీ సజావుగా జరగనివ్వకుండా స్టేలు తెచ్చుకుని ఆపుకున్నారు గనుక. మీరు ఏనాడూ ధైర్యంగా కోర్టు ముందు నిలబడలేదు గనుక!!  మీ నడక మీకోసం, మీ పార్టీ మనుగడ కోసంమనేది అందరికీ అర్ధమయ్యింది. అయినా పాపం ఇంత ఓపిగ్గా  నడుస్తున్నా మీ ఎమ్మెల్యేలూ,ఎమ్మెల్సీలూ నమ్మకం లేక జంపింగులు చేసేస్తున్నారు. 
        తమ కోసమైతే నడక కాదుగానీ, ఈ ప్రభుత్వంతో పోరాటం చెయ్యమని ప్రజలు కోరుకుంటున్నారు. అంతే తప్ప ఎన్ని వేల కిలోమీటర్లు నడిచినా, పరుగెత్తినా  ప్రయోజనం శూన్యం అనుకొంటున్నారు.  ఇక మా తూ.గో. జిల్లా ప్రజలైతే ఒక్కసారి ఆయన జొన్నాడ సెంటర్ నుంచి వేమగిరి సెంటర్ వరకూ నడిస్తే ఆ రోడ్డుకు పట్టిన దరిద్రం వొదిలిపోతుందని ఎంతగానో కోరుకొంటున్నారు. ఎందుకంటే ఆయన నడిచిన ప్రతి రోడ్డుఅంచూ ముందుగానే ఎంతో శుభ్రం చేస్తున్నారు గనుక!
       రాజకీయనాయకుల నైతిక విలువలు పతనమైపోయిన కారణంగానే ప్రజలు రాజకీయాలంటే  అసహ్యించు కుంటున్నారనేది స్పష్టం. ప్రజలు రాజకీయ నాయకులెవరినీ నమ్మలేనిస్థితిలోవున్నారు. అందుకే సమస్య లెదురైనప్పుడు  స్వచ్చందంగా రోడ్ల మీదకి వొచ్చి తమనిరసనలు తెలియజేస్తున్నారు . ఇందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన ఢిల్లీ గాంగ్ రేప్ కేసు-అవినీతిపై అన్నాహజారే దీక్షలు.  ప్రజలు రాజకీయాలను  ఎందుకు అసహ్యించుకుంటున్నారనే విషయం రాజకీయ పార్టీల నాయకత్వం అర్ధం చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ నాయకత్వాల్ని మార్పు చేసుకున్నప్పుడే ఈ దేశంలో రాజకీయపార్టీలు మనుగడ సాగించగలుగుతాయి.
దురదృష్ట వశాత్తూ ఏ రాజకీయ పార్టీ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు కనబడడం లేదు!!

3 కామెంట్‌లు:

  1. praja prasthanam, odharpu peru tho chese/chesina yaathralu yevari kosamo mari ?

    రిప్లయితొలగించండి
  2. mee ku visham talkekki vaasta vaalu choodaleka potunnnaaru , prajalu neeraajanm padutunnaaru babu ki

    రిప్లయితొలగించండి
  3. మరో ప్రజాప్రస్థానాలూ,ఓదార్పులూ, "మీ"కోసాలూ ఇవన్నీ మోసాలేననే నేను చెప్పింది. ఏ పార్టీకయినా అదే వర్తిస్తుంది.కుల,మత ప్రాంతీయాభిమానాలతో గుడ్డిగా జండాలు మోసేవారికి నిజాల్ని నిజంగా ఒప్పుకోడానికి అహం అడ్డుపడుతూ ఉంటుంది.నేను రాసిన దాన్లో నిజం కానిదేదో మీరు అజ్ఞాత ముసుగు తొలగించి చెపితే సరిదిద్దుకుంటాను.వైఎస్సార్ పార్టీ వారి పేరెత్తలేదనే మీ కోపం నాకర్ధమయింది.బాబు గారి 2000 కి.మీ. సందర్భం వొచ్చింది గనుక వారి గురించి వ్రాయవలసి వొచ్చింది. త్వరలో వారి గురించి కూడా చదువుదురుగాని.

    రిప్లయితొలగించండి