18, నవంబర్ 2011, శుక్రవారం

మీ నాయకుడి స్వచ్చత నిరూపించుకోండి!! మీ మలినాన్ని కోర్టులకి అంటించకండి!!


          చంద్రబాబు ఆస్తులపై విజయమ్మ వేసిన వ్యాజ్యం హైకోర్టు స్వీకరించగానే తెలుగుదేశం నాయకుల నాలుకలు మడత పడుతున్నాయి. ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ జడ్జీగారు రిటైరుమెంటు తొందరలో ఉన్నారని, యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కాంగ్రెస్స్- వై.ఎస్,ఆర్ .కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై కేసు వేసారని,స్వచ్చమైన వ్యక్తిని వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల నాలుకలు ఏవిధంగా తిప్పగలరో ఈ ఉదంతం చెపుతుంది. వీరు ఎదుటివారిపై కేసు వేస్తే, అది కోర్టు ఆమోదిస్తే అది ఒప్పు. అదే పని ఎదుటివారు చేస్తే అది తప్పు! యనమల గారూ మీడప్పు మీరు వాయిన్చుకోడం కాదు. జనం వాయించాలి. జనం మాటెలా ఉన్నా రేపట్నించి సిబిఐ వాయిస్తుంది లెండి.  విచారణ నెదుర్కొని మీ నాయకుడి స్వచ్చత నిరూపించుకోండి!!
              జగన్ తనపై సిబిఐ విచారణ విషయంలో ప్రధానమంత్రి కాళ్ళపై పడి ప్రాధేయపడి, వారితో కుమ్మక్కై కేసు వేశాడని చెపుతున్న వీరికి, కోర్టుల్నీ,న్యాయమూర్తుల్నీ కించపరుస్తున్నామన్నఇంగిత జ్ఞానం కూడా లేదు. మరి వీరు ఎవరితో కుమ్మక్కై జగన్ పై కేసు  వేసారు? వై.ఎస్.ఆర్.బతికుండగా నోళ్ళు మూసుకుని, ఆయన చనిపోయాక ధైర్యం వొచ్చి కేసు వేసారా? జగన్ అతి త్వరితంగా రాజకీయ ప్రత్యర్ధిగా ఎదగడం చూడలేకనే వీరు కేసులు వేసారనేది విస్పష్టం!  సరే! ఇప్పుడు వీరెవరి కాళ్ళ మీద పడతారో చూడాలి. జగన్ లాగా చంద్రబాబు కూడా కాంగ్రెస్ విషవృక్షం నుంచి వూడిపడ్డ కొమ్మేనని గుర్తుకు తెచ్చుకుని, వెళ్లి ప్రధాన మంత్రి కాళ్ళమీదో, సోనియా గాంధీ కాళ్ళ మీదో పడతారా? చూద్దాం. రొచ్చుగుంటలో కూడా చేపలు పట్టాలని ప్రయత్నించే వీరు, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడి చరిత్రా ప్రజలకి తెలుసు. గత్యంతరం, ప్రత్యామ్నయం లేకనే  మీలాంటి వాళ్లకు  వోట్లు వేస్తున్నారనేది  తెలుసుకోండి! 
     
          ఈరోజు డీజీపీ ఆస్తులపై వక్ర కధనాలు ప్రచురించిన పత్రికలపై కేసు పెట్టి దర్యాప్తు జరిపిస్తున్నట్టుగా చానళ్ళలో వార్తలు వొచ్చాయి. ఒక్క చానల్ వాడూ ఒక్క  పత్రిక పేరూ చూపించలేదు. ముండ ముసుగు వేసి దాచేశారు. ఏవో "నాలుగు పత్రికలపై" అన్నారే తప్ప పేర్లు చెప్పలేదు.  అదే ఎవరైనా దొరికితే  ఫోటోలూ వీడియోలూ తీసి, చూపించిందే పదిసార్లు చూపించి రాక్షసానందం పొందే వీరు, తమ దాకా వొచ్చేసరికి "ఘోషా" పాటిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. ఈదేశంలో పత్రికా స్వేఛ్చ పేరుతో బ్లాక్ మెయిలింగ్ చేసి బతుకుతున్నవాళ్లు ఎంతోమంది!!  పత్రికలూ చానళ్ళూ రాజకీయనాయకుల సేవ చేసుకుని బతుకుతున్నవే గనుక ఇంతకంటే ఎక్కువ ఆశించకూడదులెండి!!
     మనలో మనమాట! తెలంగాణా తెలుగుదేశం తమ్ముళ్ళు  పైకి చంద్రబాబుపై  సానుభూతి ప్రకటిస్తున్నా, లోపల్లోపల సంతోషిస్తున్నట్టే కనబడుతోంది!!

1 కామెంట్‌: